
ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్ బిల్లా యాదగిరి
న్యూస్ డెస్క్: వేలేరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి పనులు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. వేసవికాలం తీవ్రత దృష్ట్యా పనులు చేస్తున్న కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా విరామాలు తీసుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు మరియు ORS ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన వేతనాలు త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉపాధి హామీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
