పద్మాక్షి శివ ముక్తి ధామ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని,KUDA చైర్మన్,కలెక్టర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి, అధికారులు

హనుమకొండ న్యూస్ : సుదూర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వరంగల్ మహానగరానికి వచ్చి కిరాయి ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయిన సమయంలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమస్యను గుర్తించిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి విషయాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, సమస్యను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ,KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, KUDA సంబంధిత అధికారులతో కలిసి పద్మాక్షి శివ ముక్తి ధామ్ స్థలాన్ని పరిశీలించారు. నిరుపేదలు, వలస కార్మిక కుటుంబాలు తమ ఆత్మీయులకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పుల్లూరి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, ప్రముఖ సామాజిక సేవావేత్త డాక్టర్ అనితా రెడ్డి, పలువురు స్వచ్ఛంద సేవకులు పాల్గొని తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.

ప్రజల అవసరాలను గుర్తించి మానవతా దృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ అధికారులకు డాక్టర్ అనితా రెడ్డి కృతజ్ఞతలు తెలియ చేసారు.ఈ వసతులు అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుందని, తమ ఆత్మీయులకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పి. ఎన్. మూర్తి, మహేంద్ర కపూర్, అధికారులు పాల్గొన్నారు