కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు విజయవంతం – 108 అంబులెన్స్ సేవలకు కలెక్టర్, డీఎంహెచ్ఓ ప్రశంసలు

నర్సంపేట న్యూస్ : కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి. పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా 108 అంబులెన్స్ సిబ్బంది తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులకు నిరంతర అత్యవసర వైద్య సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు.
పుష్కరాల కాలంలో మొత్తం 650 మందికి పైగా రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించి, అవసరమైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వడదెబ్బ, జ్వరాలు, ప్రమాదాలు, కిందపడటం, డీహైడ్రేషన్ వంటి అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించి అనేక మంది ప్రాణాలను కాపాడారు.
తీవ్రమైన వేసవి పరిస్థితుల్లోనూ 108 పైలట్లు, ఈఎంటీలు, జిల్లా నిర్వహణ బృందం మరియు సహాయక సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించి సేవలను సమర్థవంతంగా అందించారు.
108 అంబులెన్స్ సిబ్బంది అందించిన విశిష్ట సేవలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. మధుసూదన్ అభినందిస్తూ ప్రత్యేకంగా ప్రశంసించారు.


ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ వంకుడోత్ రాజు నాయక్ మాట్లాడుతూ, పుష్కరాల విజయవంతమైన నిర్వహణలో భాగస్వాములైన ప్రతి పైలట్, ఈఎంటీ, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఎండలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించిన 108 సిబ్బంది సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజా సేవలో 108 అంబులెన్స్ సిబ్బంది మరోసారి తమ అంకితభావాన్ని చాటుకొని, సరస్వతి అంత్య పుష్కరాల విజయానికి కీలక భూమిక పోషించారని ఆయన తెలిపారు.