– అధికారుల నిర్లక్ష్యంతో రైతు రోడ్డున

– కేంద్రాలు తెరిచామంటూ నాటకం.. నేలపై కొనుగోలు జీరో
– సర్పంచులు మౌనం… రైతు బాధ ఎవరి బాధ్యత?
– దళారుల దందాకు గ్రీన్ సిగ్నల్… మద్దతు ధర కేవలం మాటలకే?

న్యూస్ డెస్క్ : ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన వడ్ల కొనుగోలు కేంద్రాలు నేలపై మాత్రం కనబడటం లేదు. కేంద్రాలు తెరిచామని చెప్పినా, అక్కడ కొనుగోలు ప్రక్రియ మొదలుకాకపోవడంతో రైతులు రోజూ చుట్టాలు కొడుతున్నారు. పంట చేతికొచ్చి నిల్వలు పెరిగిపోతుంటే, కొనుగోలు లేక రైతు గుండెల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటికే వర్షాల బెడద మొదలైంది. పొలాల్లో ఎండబెట్టిన వడ్లు తడవడంతో నాణ్యత దెబ్బతింటోంది. మార్కెట్‌లో ధర పడిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది. “పంట పండించాం… కానీ అమ్ముకునే పరిస్థితి లేదు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నా, స్థానిక స్థాయిలో అధికార యంత్రాంగం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొనుగోలు ప్రారంభించాల్సిన సిబ్బంది కేంద్రాల్లో కనిపించకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారీ వ్యవస్థ మళ్లీ తలెత్తుతోంది. తక్కువ ధరకు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి, లాభాలు కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందకుండా మధ్యవర్తులు లాభపడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ స్థాయిలో సమస్యలు తలెత్తుతున్నా, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.