నర్సంపేట న్యూస్ : సర్వాపురం గ్రామంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి పురోహిత్ సంఘం అధ్యక్షులు, కేరళ తాంత్రిక ఆచార్యులు, మహా శాస్త్ర కుసుమ ప్రదీప్ తంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం కోసం స్థల సేకరణ, భవన నిర్మాణం, నిధుల సమీకరణ తదితర అంశాలపై సంఘ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

శ్రీ మార్కండేయ మహర్షి వేద విద్యాపీఠాన్ని ఏర్పాటులో భాగంగా నిర్మాణానికి సహకారంగా ప్రదీప్ తంత్రి రూ. 5,11,116లను విరాళంగా ప్రకటించి అందజేశారు. ఆయన అందించిన ఆర్థిక సహాయానికి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
అదే కార్యక్రమంలో సంఘం ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను ప్రదీప్ తంత్రి ప్రారంభించారు. అనంతరం సర్వాపురం అధ్యక్షుడు కూచన రవీందర్తో పాటు సంఘ పెద్దలు ప్రదీప్ తంత్రి మరియు విచ్చేసిన ప్రముఖులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు.
