ఉస్మానియా యూనివర్సిటీ: ప్రపంచానికి శాంతి, ప్రేమ మరియు సమానత్వ మార్గాన్ని చూపిన మహనీయుడు గౌతమ బుద్ధుడని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ పేర్కొన్నారు. బుద్ధుని 2570వ జయంతి సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
పొలిటికల్ సైన్స్ విద్యార్థి నాయకుడు ఏఐఒబిసిఎస్ ఎఫ్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరియు ప్రొఫెసర్ ఇందిరా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. బుద్ధుని మహత్తర ఆలోచనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, ఆయన చూపిన బాటలో నడవడం ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని వివరించారు.
అస్తిత్వం కోసం పోరాడాలి: చేరాల వంశీ
కార్యక్రమంలో పాల్గొన్న బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ మాట్లాడుతూ, మన ఉనికి, అస్తిత్వం మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బుద్ధుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సత్యం, న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. బుద్ధుని బోధనలు మనలో మార్పు తెచ్చే శక్తిని కలిగి ఉంటాయని, అవి మనలోని భయాన్ని తొలగించి సమాజంలో గౌరవప్రదంగా బతికే మార్గాన్ని చూపిస్తాయని ఆయన ఉద్ఘాటించారు.
ఈ వేడుకల్లో పలువురు విద్యార్థి నాయకులు, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని “బుద్ధం శరణం గచ్ఛామి” అంటూ నినాదాలు చేశారు.