- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల గణంకాలు లేకుండా సమగ్ర అభివృద్ధి అసాధ్యం అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.

బీసీ కుల సంఘాల నేతలతో సమన్వయ భేటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై, జనగణనలో బీసీ/ఓబీసీ వర్గాల గణనను తప్పనిసరిగా చేర్చాలనే అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీసీలకు న్యాయం చేయాలంటే ఖచ్చితమైన జనాభా లెక్కలు అత్యవసరమని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. “జనగణన దేశ నిర్మాణానికి దిక్సూచి లాంటిది. 1872 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు కొనసాగుతున్న ఈ ప్రక్రియను రాజకీయ రంగుతో మసకబార్చితే ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ప్రస్తుతం డిజిటల్ విధానంలో జరుగుతున్న జనగణనలో స్వీయ గణన, ఆన్లైన్ నమోదు వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, బీసీ/ఓబీసీ వర్గాల స్పష్టమైన గణన లేకపోవడం పెద్ద లోటు. దేశ జనాభాలో సుమారు 50–52 శాతం ఉన్న బీసీలకు సంబంధించిన అధికారిక డేటా లేకపోవడం వల్ల విధానాలు అంచనాలపైనే నడుస్తున్నాయి. ఇది సామాజిక న్యాయానికి విఘాతం” అని పేర్కొన్నారు. మరోవైపు ఆయన మాట్లాడుతూ, “గ్రామాలు, పట్టణాల్లో బీసీ వర్గాలు ఇంకా విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. ఎన్ ఎస్ ఎస్ ఓ ఎన్, ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. నిజమైన గణన లేకుండా లక్ష్యిత పథకాలు ఎలా రూపొందిస్తారు? జనగణనలో బీసీ/ఓబీసీ వర్గాల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలి. డిజిటల్ విధానంలో సులభంగా గుర్తించే ప్రశ్నలు ఉండాలి. సేకరించిన డేటా ఆధారంగా రాష్ట్రాల వారీగా పథకాలు రూపొందించాలి. జనగణనను రాజకీయ అజెండాగా మార్చొద్దు-అది దేశానికి హానికరం. బీసీలను విస్మరించొద్దు-అది సామాజిక న్యాయానికి ద్రోహం” అని స్పష్టం చేశారు. జనగణన–2027లో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన, మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ జరుగుతుందని, ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
