- 62వ డివిజన్లో రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
- ప్రజల మధ్యకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నాయిని..

న్యూస్ డెస్క్ : కాజీపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పర్యటనల ద్వారా నూతన అభివృద్ధికి నాంది పలుకుతూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం 62వ డివిజన్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
పర్యటనలో భాగంగా ముందుగా సోమిడి బొడ్రాయి వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టి ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కాలనీలో ఉన్న సమస్యలను స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి తెలుసుకున్న ఎమ్మెల్యే, ముఖ్యంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు. వెంటనే రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే శ్మశాన వాటికకు మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ సమస్యల పరిష్కారాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తదుపరి రహమత్ నగర్లో రూ.1.14 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాజీపేట ఎఫ్సీఐ గోదాం ప్రహరీ పక్కన ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పర్యటన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వారానికి రెండు నుంచి మూడు డివిజన్లలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
అభివృద్ధి పర్యటన అనంతరం ఆయా డివిజన్లలో బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని వెల్లడించారు. గతంలో ఉన్న కాజీపేట, ప్రస్తుత కాజీపేట మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను గుర్తించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
