• యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ డాక్టర్ కడియం కావ్య
• మెగా ఉద్యోగ మేళాలో యువతకు ప్రేరణాత్మక సందేశం

న్యూస్ డెస్క్ : హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా ఉద్యోగ మేళాలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎంపీ, మేళాలో ఏర్పాటు చేసిన 72 ప్రముఖ సంస్థల స్టాల్స్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్నదని, ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత అనేక దేశాల్లో సవాల్‌గా మారిందన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉద్యోగాల విషయంలో అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో యువత నిరాశ చెందకుండా తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. తాను కూడా ప్రైవేట్ రంగంలో వైద్యురాలిగా సేవలందించి, అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నానని తెలిపారు. చదువు ద్వారా వచ్చిన అవగాహనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రజా సమస్యలపై లోతుగా చర్చించే అవకాశం కల్పించిందన్నారు.
విద్యార్థి దశ ముగిసినా ప్రతి ఒక్కరూ జీవితాంతం “నిత్య విద్యార్థి”గా ఉండాలని ఎంపీ సూచించారు. కొత్త విషయాలను తెలుసుకుంటూ, నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలమన్నారు. “రాయిని పదును పెడితేనే డైమండ్ అవుతుంది” అంటూ యువతలో ఆత్మవిశ్వాసం నింపారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చదువు, నేర్చుకోవడం ఆగకూడదన్నారు.
యువతకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. “ప్రపంచంతో యుద్ధం చేస్తే అలెగ్జాండర్… నీతో నువ్వు యుద్ధం చేస్తే బుద్ధుడు” అనే వ్యాఖ్యను ఉదహరిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ధ్యానం, సానుకూల ఆలోచన అలవాటు చేసుకుంటే మానసికంగా మరింత దృఢంగా మారవచ్చన్నారు. జీవితంలో అపజయాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలని, ఒక ఉద్యోగం రాకపోతే మరో అవకాశానికి సిద్ధంగా ఉండే ధైర్యం యువతలో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపారాలు, కొత్త ఆలోచనలు, ప్రైవేట్ రంగం, స్వయం ఉపాధి అవకాశాల వైపు కూడా యువత దృష్టి సారించాలని పిలుపు నిచ్చారు. మెగా ఉద్యోగ మేళాకు హాజరైన ప్రతి యువకుడు తమ లక్ష్యాలను సాధించే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, వివిధ శాఖల అధికారులు, సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.