ఓటమి సైతం గెలుపుకే !!

పడమట పొద్దుగా వాలిందంటే
చీకటయిందని కాదు
తూర్పున వెలుగు నింపడానికి
సూర్యుడు మళ్ళీ సన్నద్ధమవుతున్నాడని!

పువ్వు రెమ్మలుగా రాలిందంటే
తనువు చాలించిందని కాదు
వేలకొద్ది పూలనివ్వడానికి
భూమిలో మళ్లీ పురుడు పోసుకుంటుందని!

వ్యక్తి జీవితాగాధంలోకి జారడమంటే
సర్వం కోల్పోవడమని కాదు
సర్వశక్తులు కూడేసి స్థిరపడడానికి
విచక్షణతో మళ్ళీ ప్రయత్నించడమని!

కవులు మౌనంగా ఉన్నారంటే
దిగులు నీడల్లో దాచుకున్నారని కాదు
సామాజిక రుగ్మతలతో పోరాటానికి
కొరడా ఝలిపే కవితలకై అక్షర సేద్యం చేస్తుండడమని!

లేనినాడు…………..
సృష్టి నేర్పిన పాఠం
పునఃసృష్టి చేయడమనేదానికి
అర్థం లేదని !!
అమ్మ నేర్పిన పాఠం
పునర్జన్మనెత్తడమనేదానికి
విలువే లేదని !!

– పోరెడ్డి మృదుల✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.