హైదరాబాద్, న్యూస్ : చేనేత కార్మికుల ఉపాధి పరిరక్షణ కోసం చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రికి ఆమె వినతిపత్రం అందజేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న మంత్రి కొండా సురేఖ

వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 50కు పైగా చేనేత సహకార సంఘాలకు చెందిన సుమారు 5 వేల మంది చేనేత కార్మికులు గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వస్త్రోత్పత్తి రంగానికి కీలకంగా సేవలందిస్తున్నారని మంత్రి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థలు మరియు ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలకు అవసరమైన బెడ్‌షీట్లు, కార్పెట్లు, యూనిఫాంలు తదితర వస్త్ర ఉత్పత్తులను నిరంతరంగా సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత మరియు చేనేత రంగ పరిరక్షణ దృష్ట్యా చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని, వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.

కేంద్రీకృత టెండర్ విధానం అమలుతో చేనేత సహకార సంఘాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని, దీనివల్ల వేలాది మంది చేనేత కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత ఉత్పత్తులను టెండర్ విధానం నుంచి మినహాయించడం ద్వారా చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల జీవనోపాధిని పరిరక్షించవచ్చని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.