🌹 నాయిక 🌹
తను నీకు
నడిచే దేహమే కావచ్చు
కానీ ప్రతిసారి మనిషిగ
నీ మనసుకై వేచింది
నీకు నేనున్నానని !
పోనీ తను నీకు
మౌన శిలయే కావచ్చు
కానీ ప్రతిరోజు శిల్పంగ
నీ వాకిలిలో నిల్చుంది
నీ నీడ నేనేనని !
బహుశా తను నీకు
విరిసే మల్లిక కావచ్చు
కానీ ప్రతిరోజు పరిమళంగ
నీ తలపులలో బ్రతికింది
నిను ప్రేమించానని !
తను నీకు
కరిగే మధువు కూడా కావచ్చు
కానీ ప్రతిరోజొక అనుభూతిగ
నీ ఒడినే తపించింది
నిను పూజించానని !
కానీ ఏనాడైనా…………….
నువ్వు చేసే
కవితా సేద్యానికి అక్షరమై
చేరాలని చూసింది
నీ కావ్యంలో
కన్యకయై మిగలాలని !
చివరకు ………..
ఆటుపోట్ల కెరటమైనా
నీ తీరాన్ని చేరాలని చూసింది
సాగరకన్యకయై
నిను కలిసే తీరాలని !
కథానాయకుని నాయికయై
తరించాలని !!
పోరెడ్డి మృదుల✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు
