😆 చోద్యం 😆

నిజాలు కదా
నిష్టూరంగానే ఉంటాయి !

తరాలుగా
అత్తలు కోడళ్లను
ఆడపడుచులు మరదళ్లను
వేపుకు తిన్నట్టు
కనబడుతుందే కానీ……..
నిజానికి
సాంప్రదాయం పేరు మీద
బావలు బామ్మర్దుల్ని
అల్లుళ్లు మామల్ని
మగవాళ్లు మగవాళ్ళని
కదా ఇబ్బంది పెడుతున్నది !

లేకపోతే
రాజ్యాలేమైన
మహారాణుల సొంతమా ?
ఆస్తులేమైన
సుందరాంగుల కష్టార్జితమా ?!

యుగాలుగా
చేతులు మారుతూ
ఇక్కడిది కాక
అక్కడిదైంది కనుక
అబలన్నారు కానీ ……….
నిజానికి
ఆచారం పేరు మీద
ఇక్కడి నుంచి అక్కడికి
అక్కడి నుంచి ఇక్కడికి
తనదికాని బరువైన ఇంటిపేరును
తను కదా మోస్తున్నది !

కాకపోతే
అత్తారిల్లు
అత్తగారు కట్టించింది కాదు !
కట్న కానుకలు
అమ్మగారిచ్చినవీ కావు !

చోద్యమని తెలిసి కూడా ……
ఎవరింటికెళితే ఆఇంటిపేరొచ్చే
ఆడవాళ్లుగ కొట్లాటలెందుకు ?
మనది కాని దానికోసం
గృహహింసలెందుకు ?

– పోరెడ్డి మృదుల✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.