పొద్దు కాదు – తను ఉషస్సు

చిరునవ్వును నటించలేదు
గుండెలుప్పొంగి
వాగులైతున్న వేళ
మనసారా నవ్వుతుంది !

కన్నీటి చుక్కలు పెట్టలేదు
చుక్కల చీర కట్టి
రంగవల్లులేయాల్సిన వేళ
ముత్యాలముగ్గులవుతుంది !

బాల్యం నుండి యవ్వనం
యవ్వనం నుండి వైవాహికం
వైవాహికం నుండి వృద్ధాప్యం
వృద్ధాప్యం నుండి స్వర్గందాకా
సర్వం తానైనప్పుడు……….

మంద్రంగా అసలే నడవలేదు
తనతో నడిచిన పాదాలకు
తోడవ్వాల్సిన వేళ
అడుగులకు మడుగులొత్తి
మరీ నడుస్తుంది !

సంధెవేళలు పిల్లగాలులతో
మల్లెపూలు మంచిగంధాలతో
ఒంపు సొంపులై
కలిసిన వేళ……..

ఆశలను అడియాసలు చేయలేదు
సరి కదా ……..
అనుక్షణం ప్రకృతై
బ్రతుకున పరవశిస్తుంది !!

కర్మయోగాలు జన్మజన్మాలతో
కష్టసుఖాలుయుగయుగాలతో
ఇంద్రధనుసులై
ప్రమాణాలైన వేళ

పడమట వాలేపొద్దు కానే కాదు
సరి కదా ……….
ప్రతిదినం ఉషస్సై
తూర్పున సింధూరమవుతుంది
తను !!

– పోరెడ్డి మృదుల ✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు.

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.