• బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతోంది: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

• రైతులకు బేడీలు వేసిన వాళ్ళు, రైతుల గురించి మాట్లాడడం విడ్డూరం

• రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం

• అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిపై కేటీఆర్ సంస్కారహీన వాఖ్యలు సిగ్గుచేటు

న్యూస్ డెస్క్ : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే Kadiyam Srihari తీవ్రస్థాయిలో విమర్శించారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ సందర్భంగా రూ.3 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.48 లక్షలతో చేపట్టిన ఇతర సీసీ రోడ్లు, ఎస్సీ, రజక కమ్యూనిటీ హాళ్లు, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడలు, ఇందిరమ్మ ఇళ్లతో కలిపి మొత్తం రూ.3.62 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అక్కసుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పై కేటీఆర్ సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో గన్ని బ్యాగుల కొరత, గోదాముల సమస్యల కారణంగా కొంత జాప్యం జరుగుతోందని, రైతులు దీనిని అర్థం చేసుకోవాలని కోరారు.

పెద్ద పెండ్యాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల సంపాదించి, వందల ఎకరాలు కూడబెట్టుకున్న వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్దగా సహకారం అందించలేదని, రాష్ట్ర అభివృద్ధిపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు.

తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతి చేయలేదని, ఎవరినీ పని కోసం డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. పెద్దపెండ్యాల గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామానికి అన్ని వైపులా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.


ఇప్పటికే 54 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో మరో 50 ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్నందునే నియోజకవర్గానికి భారీగా అభివృద్ధి నిధులు తీసుకురాగలుగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తోట నాగరాజు, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.