- వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
న్యూస్ డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, సమావేశం ముగింపు సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి గారిని కలిసి. శుభాకాంక్షలు తెలియజేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధిలో మేయర్ గుండు సుధారాణి కృషి ప్రశంసనీయమని తెలిపారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో మేయర్ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు. తాను ఎంపీగా కూడా వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల అమలులో సహకారం అందించడం, డ్రైనేజ్, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి కూడా ఎంపీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నగర అభివృద్ధికి సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
