• ఫార్మా సిటీ భూములపై రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం

• టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత

న్యూస్ డెస్క్ : హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది?” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత పాల్గొని ఫార్మా సిటీ బాధిత రైతులకు మద్దతు ప్రకటించారు. ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని, ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయమని ఆమె ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజలకు నిజం చెప్పే ధైర్యం కూడా లేకుండా పోయిందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులు పండించే పంట కొనుగోలు చేయలేమని ముఖ్యమంత్రి చెప్పినా, ఆ విషయాన్ని ప్రజలకు వెల్లడించలేదని ఆరోపించారు. రైతుల ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని, ప్రజాసమస్యలపై కేవలం సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం ముందస్తు చర్చ లేకుండానే నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం 13,500 ఎకరాలు సేకరించామని చెప్పిందని, అందులో కుందుకూరు, యాచారం మండలాల్లో వేల ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకునే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం అదే ప్రాజెక్టును “ఫ్యూచర్ సిటీ” పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, 30 వేల ఎకరాల భూసేకరణపై ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. భూములు తీసుకున్న తర్వాత రైతుల జీవనోపాధి ఏమవుతుందో, కాలుష్యం ఎంత పెరుగుతుందో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం వెల్లడించడం లేదని ప్రశ్నించారు. డేటా సెంటర్ల పేరుతో భారీ కాలుష్యానికి కారణమయ్యే ప్రాజెక్టులను తీసుకువస్తున్నారని, వాటి ప్రభావంపై ఎలాంటి అంచనాలు వేయలేదని తెలిపారు. రైతుల భూములు తీసుకుని తక్కువ పరిహారం ఇచ్చి వారిని రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.

భూసేకరణలో వివక్ష జరుగుతోందని, పెద్ద భూస్వాముల భూములను వదిలి గిరిజనుల భూములను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. గిరిజనులు, రైతులు చేస్తున్న పోరాటాలకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి” అనే విధానంతోనే తమ పోరాటం కొనసాగుతుందని, ఫార్మా సిటీ భూముల విషయంలో రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రైతులు, ఉద్యమకారులకు నష్టం జరిగిందని అంగీకరించిన కవిత, ఆ ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ చెప్పారు. ఫ్యూచర్ సిటీ పేరుతో బుల్లెట్ ట్రైన్, భారీ పెట్టుబడుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదని విమర్శించారు. కోర్ హైదరాబాద్ అభివృద్ధిపై కూడా ఈ ప్రాజెక్టుల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. చివరగా, “ఫార్మా సిటీ రైతులకు మేలు జరిగే వరకు మేము ముందుండి పోరాడుతాం. ఈ మొండి ప్రభుత్వాలకు ఎదురుగా మనం జగమొండిగా నిలబడాలి” అని కవిత పిలుపునిచ్చారు.