న్యూస్ డెస్క్ : వరంగల్: గీసుగొండ మండలంలోని వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ పరిధిలో గల రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ విగ్రహం మరియు ఆధునిక పార్కు అభివృద్ధి పనులకు గురువారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హనుమకొండ డీసీసీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టౌన్‌షిప్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పార్కును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యువత, పిల్లలు, వృద్ధులు విశ్రాంతిగా గడిపేలా అన్ని వసతులతో పార్కును తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, జిల్లా డీసీసీ అధ్యక్షులు అయ్యూబ్ అలీ, మాజీ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కుడా పి.ఓ అజిత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.