న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం అధ్యక్షత వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తపు మురళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు హాజరై సంఘ బలోపేతం, చేనేత వర్గాల అభ్యున్నతి, సామాజిక సేవా కార్యక్రమాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా వాసి, పద్మశాలి పరపతి సంఘాల జేఏసీ హన్మకొండ కన్వీనర్ వైద్యం రాజగోపాల్‌ను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులను అందజేశారు.
వైద్యం రాజగోపాల్ పద్మశాలి కుల బాంధవుల సంక్షేమం కోసం నిరంతరం సేవలు అందిస్తూ, వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయాన్ని గుర్తించి ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తపు మురళి తెలిపారు.
రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిన సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాజగోపాల్‌ను ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
