• సెల్ఫ్ ఎన్యుమరేషన్ – ఫీల్డ్ సర్వే మధ్య సమన్వయం లేకపోతే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం
– గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న లోపాలు, గందరగోళ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే సరైన అమలు లేకపోతే భవిష్యత్తులో సంక్షేమ విధానాలు, సామాజిక ప్రణాళికలు, రిజర్వేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో ఇప్పటికే లక్షలాది మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకున్నారని, కానీ అదే సమయంలో ఇంటింటికీ తిరుగుతున్న ఎన్యుమరేటర్లు మళ్లీ అదే కుటుంబాల వివరాలను సేకరిస్తుండటంతో ద్వంద్వ నమోదు, సమాచారం పునరావృతం, గణాంకాల్లో వ్యత్యాసాలు తలెత్తే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

ప్రత్యేకించి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో ఉద్యోగం, వ్యాపారం, విద్య అవసరాల కోసం నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాల వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో నమోదు చేసినట్లు తెలుస్తోందని, అయితే ఇప్పుడు అదే వ్యక్తులను నగరాల్లో మళ్లీ నమోదు చేస్తున్నారనే అంశం తీవ్రమైన పరిపాలనా లోపాన్ని బయటపెడుతోందన్నారు.

“ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ ఆధునిక విధానాలు తీసుకురావడం అభినందనీయం. కానీ క్షేత్రస్థాయిలో అమలు యంత్రాంగానికి తగిన శిక్షణ, అవగాహన, సాంకేతిక మార్గదర్శకాలు లేకపోతే ప్రజలకు గందరగోళం, ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించే గణాంకాలే మిగులుతాయి” అని గుజ్జ సత్యం విమర్శించారు.

ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఎన్యుమరేటర్లకు సర్వే విధానంపై సరైన అవగాహన లేదని, సెల్ఫ్ ఎన్యుమరేషన్ డేటాను ఎలా పరిగణించాలో స్పష్టత లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల సంఖ్య, చిరునామాలు, వలస వివరాలు, ఉపాధి సంబంధిత అంశాల్లో అసమగ్ర సమాచారం నమోదు అవుతున్నట్టు ఆరోపించారు.

బీసీ వర్గాల భవిష్యత్తు, సంక్షేమ పథకాల ప్రణాళికలు, విద్యా – ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయ విధానాల రూపకల్పనకు ఈ గణాంకాలు కీలకమని గుర్తుచేస్తూ, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద అన్యాయాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు:

• ఎన్యుమరేటర్లకు అత్యవసర రీ-ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి
• సెల్ఫ్ ఎన్యుమరేషన్ – ఫీల్డ్ సర్వే డేటా సమన్వయానికి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి
• ద్వంద్వ నమోదు నివారణకు ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను అమలు చేయాలి
• ప్రజలకు స్పష్టమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
• నగరాలకు వలస వచ్చిన వారి వివరాల నమోదు విషయంలో ప్రత్యేక విధానం రూపొందించాలి

“జనగణన అనేది కేవలం సంఖ్యల లెక్క కాదు. అది భవిష్యత్ పాలనకు, సామాజిక న్యాయానికి, బీసీల హక్కుల పరిరక్షణకు పునాది. ఈ ప్రక్రియలో జరిగే ప్రతి తప్పు భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసే ప్రమాదం ఉంది” అని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.

Avatar photo

By Murthy