హనుమకొండ జె.ఎన్.ఎస్ (JNS) స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్

న్యూస్ డెస్క్ : స్థానిక జె.ఎన్.ఎస్  స్టేడియంలో 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు (ఏప్రిల్ 28-30) జరిగే ఈ పోటీలను హనుమకొండ డిసిసి అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో కరచాలనం చేస్తూ, వారిని పేరుపేరునా అభినందిస్తూ ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ నగరం క్రీడలకు నిలయంగా మారుతోందని, ఇలాంటి ప్రాంతీయ స్థాయి పోటీలు క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు తోడ్పడతాయని, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హ్యాండ్ స్టేట్ సెక్రెటరీ శ్యామల ప్రవీణ్, ఆల్ ఇండియా హ్యాండ్ బాల్ సెక్రెటరీ సింగ్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ప్రశాంత్, స్టేట్ జూడో సెక్రెటరీ కైలాష్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా అధికారులు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు.