నర్సంపేటలో వీధి కుక్కల బీభత్సం పెరుగుతోంది. 29వ వార్డులో 17 మందిపై దాడి. బాధితులను పరామర్శించిన డా. రాణా ప్రతాప్ రెడ్డి

న్యూస్ డెస్క్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా 29వ వార్డులో ఇటీవల జరిగిన ఘటనలో వీధి కుక్కలు 17 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారిలో సుందరగిరి పుష్పలీల, షేక్ జానీ తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సంపేట పట్టణంలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

కాలనీల్లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్ మరియు ద్విచక్ర వాహనదారులు కుక్కల భయంతో బయటకు రావడానికి కూడా సంకోచించే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత విషమంగా మారుతుందని, ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని, సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించి తర్వాత నిర్లక్ష్యం చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మరియు పాలకవర్గం సమస్య తీవ్రతను గుర్తించి, వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, బీజేవైఎం నాయకులు జూలూరు మనీష్ గౌడ్, కొంకీస విగ్నేష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, తప్పెట్ల సతీష్, ఆడెపు చందు, కొండ్ర సాయి తదితరులు పాల్గొన్నారు.