• ఘనంగా 29వ వార్షికోత్సవం.. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
హనుమకొండ, న్యూస్ : అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు మాతృభాష తెలుగు పరిరక్షణకు కూడా కృషి చేయాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పిలుపునిచ్చారు.
బుధవారం హనుమకొండ లయన్స్ భవన్లో థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ 29వ వార్షికోత్సవం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పరికిపండ్ల వేణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ, ఆంగ్ల భాషపై మక్కువతో మాతృభాషను విస్మరించడం సరికాదన్నారు. తెలుగు భాష అభివృద్ధికి లయన్స్ ప్రతినిధులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల్లో ముందుండి అవసరార్థులను ఆదుకుంటే సమాజాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
320ఎఫ్ జిల్లా నూతన గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని 80 లయన్స్ క్లబ్బులు సేవా కార్యక్రమాల్లో పోటీపడి ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. సమయపాలన, ప్రణాళికాబద్ధమైన సేవా కార్యక్రమాలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలని అన్నారు.
ఎల్‌సీఐఎఫ్ మల్టిపుల్ కోఆర్డినేటర్ కె. హరీష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఎల్‌సీఐఎఫ్ నిరంతరం సేవలందిస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని క్లబ్బులు సేవాభావంతో ఎల్సీఐఎఫ్కు నిధులు సమకూర్చాలని కోరారు.
ప్రస్తుత జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ, ఈ నెల 28న నిర్వహించే ‘అవార్డ్స్ నైట్’లో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన లయన్స్ సభ్యులను సత్కరించనున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
2026–27 లయనిస్టిక్ సంవత్సరానికి థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా వైద్యం రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా గంజి నరహరి, కోశాధికారిగా మార్త పాపయ్యతో పాటు నూతన కార్యవర్గ సభ్యులతో మొదటి ఉప గవర్నర్ లయన్ హరికిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వైద్యం రాజగోపాల్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ అంతర్జాతీయ సంస్థ ఆశయాలకు అనుగుణంగా మరిన్ని సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి క్లబ్ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పీడీజీలు డాక్టర్ సుధాకర్ రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, కన్నా పరశురాములు, లక్ష్మీ నరసింహారావు, డాక్టర్ రాజేందర్ రెడ్డి, ఎస్వీడీజీ రేవూరి రమణారెడ్డి తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఇన్స్టాలేషన్ చైర్మన్ తాళ్లపెల్లి సురేష్ గౌడ్ స్వాగతం పలకగా, కో-చైర్మన్ రాచర్ల రాజేష్‌తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
