ఉత్తమ జర్నలిస్టులకు గోవా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ జర్నలిస్టులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల సంఘం కీలక నిర్ణయం
హైదరాబాద్ : తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక అద్భుత ఘట్టానికి భాగ్యనగరం వేదిక కాబోతోంది. హైదరాబాద్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్లో భారీ ఎత్తున జర్నలిస్టుల సదస్సు మరియు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉత్తమ జర్నలిస్టులను గౌరవించడమే కాకుండా, వారి వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది.
ముఖ్య అతిథిగా గోవా గవర్నర్
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి గోవా గవర్నర్ గౌరవనీయులు అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు పురస్కారాలు అందజేయనుండటం విశేషం. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జరగనున్న ఈ వేడుకను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
జర్నలిస్టుల పండగ వాతావరణం
ఈ సందర్భంగా సంఘం నేతలు మేనం శ్యామ్ మరియు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ.. “రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా జర్నలిస్టులు తరలివచ్చేలా క్షేత్రస్థాయిలో పర్యటించి అందరినీ ఆహ్వానిస్తాం. జర్నలిస్టులందరికీ ఇది ఒక పండగ వాతావరణంలా అనిపించేలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు మేనం శ్యామ్, నిర్మల, గడ్డం సత్యనారాయణ, గిలగత్తుల శ్రీనివాస్, వేముల రమేష్, కోల ప్రవీణ్, మల్లేష్, మహేష్ గాడ్సే, శ్రీకాంత్, పవన్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
