న్యూస్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ డిసిసీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసిన వెంకట్రామ్ రెడ్డికి గ్రామస్థులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి, విఘ్నసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో ఇంత భవ్యమైన ఆలయాన్ని నిర్మించిన గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి భక్తుడికి దేవుని ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.

ఈ మహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.