వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.30 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ వెల్లడించింది. గత ఏడాది 92 శాతం మాత్రమే ఉండగా, ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలు అబ్బాయిలపై ఆధిపత్యం చాటుతూ ఎక్కువ మార్కులు సాధించారు. దాదాపు అన్ని జిల్లాల్లో టాప్‌ స్థానాలను అమ్మాయిలే దక్కించుకున్నారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు:
• bse.telangana.gov.in
• results.bse.telangana.gov.in
• results.bsetelangana.org
• schooledu.telangana.gov.in

వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా తెలుసుకోండి:
విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి, “SSC Results” అని టైప్ చేసి హాల్‌టికెట్ నంబర్ మరియు అవసరమైన వివరాలు నమోదు చేస్తే వెంటనే మార్కుల మెమో స్క్రీన్‌పై అందుబాటులోకి వస్తుంది.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1 నుంచి 23 వరకు పూర్తయ్యింది. అనంతరం కేవలం వారం రోజుల్లోనే మార్కుల ఎంట్రీ ప్రక్రియను ముగించి ఫలితాలను వేగంగా విడుదల చేశారు.

రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలు:
రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ దరఖాస్తులకు రేపటి నుంచి మే 15 వరకు అవకాశం కల్పించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు రేపటి నుంచి మే 14 వరకు అవకాశం ఉంది.

ములుగు జిల్లా టాప్:
ఈసారి ఫలితాల్లో ములుగు జిల్లా తొలి స్థానంలో నిలవడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది ఫలితాలు విద్యార్థుల కృషి, విద్యాశాఖ సమర్థతను ప్రతిబింబిస్తూ మంచి విజయశాతంతో నిలిచాయి..