- గజ్వేల్‌లో ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు
న్యూస్ డెస్క్ : మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గజ్వేల్‌లో విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికలు దేశ రాజకీయాలకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. డబ్బు, అధికార ప్రభావం ఉన్నప్పటికీ సామాన్య ప్రజలు విజయం సాధించగలరని ప్రజాస్వామ్య శక్తిని మరోసారి నిరూపించాయని అన్నారు. 1983లో నందమూరి తారక రామారావు విజయం ఎలా చరిత్ర సృష్టించిందో, అదే స్ఫూర్తి నేటి పరిస్థితుల్లో కూడా కనిపిస్తోందన్నారు. ప్రజలే చరిత్ర సృష్టికర్తలని, వారి తీర్పే తుదితీర్పని పేర్కొంటూ డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదని స్పష్టం చేశారు.

ధర్మం, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారనే విషయానికి తమిళనాడు ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. గుజరాత్‌లో ప్రజలు నిరంతరం ఒకే పార్టీకి మద్దతు ఇస్తూ అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రజా పాలన ఎలా ఉండాలో అక్కడి పరిస్థితులు చూపుతున్నాయని చెప్పారు. మరోవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రెండేళ్లకే వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అలాగే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహంకార పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో త్రిభుజ పోటీ ఉన్న చోట్లే టీఆర్ఎస్ గెలిచిందని, లేకపోతే పూర్తిగా ఓడిపోయేదని అన్నారు. దేశ భద్రత, సమగ్రత కోసం ప్రజలు ఓటు వేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నిర్లక్ష్యం చేసే పాలనలను ప్రజలు తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. బెంగాల్‌లో కూడా ప్రజలు నియంతృత్వాన్ని అంగీకరించలేదని గుర్తుచేశారు.
బీజేపీ కార్యకర్తలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చిందని, ఆ ఆశలను నిజం చేసేందుకు మోదీ గారు స్వయంగా వస్తున్నారని తెలిపారు. ఈ సభకు భారీగా హాజరై ఆశీర్వదించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, సీనియర్ నాయకులు కప్పర ప్రసాద్, భాస్కర్, శ్రీనివాస్, సింగం సత్తన్న, రామ్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, నందన్ గౌడ్, మల్లేష్, అశోక్ యాదవ్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ఐలయ్య యాదవ్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
