🌹ఓ ప్రియా ………….🌹

నీ తలపులే అనుభూతులు
నీ వలపులే అనురాగాలు
ఏడేడు జన్మాలు గుర్తుచేసే
నీ పిలుపులే ప్రేమసందేశాలు !

నీతోనే కాలం
మొదలయ్యే తనకు
శూన్యమవుతుంది
నువ్వు లేని క్షణం !
నీ ముఖారవిందమే
వెలుగయ్యే తనకు
చీకటవుతుంది
నిను చూడని క్షణం !

తారలను లెక్కించినా
వృధా ప్రయాసలేనంటుంది
జాబిలితో చెప్పినా
కడు మోసమేనంటుంది
పోనీ …………..
తనలోనే ఉన్నావని
అంతరంగాన ఆలింగనం
చేసుకున్నా
ఫలితం శూన్యమేనంటుంది !

తన నవ్వుల సడికో
యథ సవ్వడికో ఐనా
నువ్వు చేరాలి కదా !
తన కాటుక రేఖకో
కురుల పిలుపులకో ఐనా
నువ్వు వాలాలి కదా !

నీ చూపులకే
జన్మ ధన్యమవుతుందనే తనను
మరొకమారు
మాయ చెయ్యాలి కదా !
నీ స్వరానికే వేణుగానమని
పులకరించే తనను
మరొకసారి తియ్యని
మోసం చెయ్యాలి కదా !

“ప్రియే” …………. అని పిలిచి !!

– పోరెడ్డి మృదుల ✍🏻
కవయిత్రి, తెలుగు అధ్యాపకురాలు

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.