దాదాపు 50కోట్లతో 7విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం & శంకుస్థాపనలు చేయనున్న డిప్యూటీ సీఎం

పల్లగుట్టలో 5వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సభను విజయవంతంగా నిర్వహించాలి

న్యూస్ డెస్క్ : నెల 7వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్టేషన్ ఘనపూర్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క  పర్యటనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలం, పీచర గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని, చిల్పూర్ మండలం, కొండాపూర్ గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రం, జఫర్గడ్ మండలం, సాగరం గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రం, రఘునాథపల్లి మండలం, కుర్చపల్లి గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రాలను ప్రారంభించనున్నారన్నారు. అలాగే చిల్పూర్ మండలంలో 33/11 కేవీ లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 50కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఉప కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిల్పూర్ మండలం పల్లగుట్టలో సుమారు 5వేల మందితో భారీ భాహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సభ ఏర్పాటుకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యుటీ సీఎం పర్యటనకు సంబందించి శిలాఫలకాల ఏర్పాటు, విద్యుత్, తాగునీరు, సభా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూడాలన్నారు.

సభా స్థలి వద్ద పలు మోడల్ స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, సంబంధిత లబ్ధిదారులు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని కార్యక్రమాలు సమయపాలనతో నిర్వహించాలన్నారు. అదే విధంగాధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పర్యటనలో భాగంగా ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్డివో వెంకన్న, డీఏఓ అంబికా సోనీ, జెడ్పీ సీఈవో రంగా రావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, విద్యుత్ శాఖ అధికారి సంపత్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *