• మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

న్యూస్ డెస్క్ : ఐనవోలు మండలం గర్నేపల్లి గ్రామంలో బొడ్రాయి, ధ్వజస్థంభం, కట్టమైసమ్మ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జఫర్ గడ్ మండలం కునూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న హోమం కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మ, ఎల్లమ్మ తల్లి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్నేపల్లి గ్రామంలో గ్రామస్తులంతా కలిసి బొడ్రాయి, ధ్వజస్తంభం, కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే విధంగా గ్రామ అభివృద్ధిలో కూడా గ్రామస్తులంతా కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. ఇప్పటికే గర్నేపల్లి గ్రామ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. గర్నేపల్లి నుండి తిడుగు, సాగరం మీదుగా బిటీ రోడ్డు మరియు గర్నేపల్లి నుండి కునూరు వరకు బిటీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామంలో అంతర్గత సిసి రోడ్లతో పాటు బొడ్రాయి వద్ద సిసి ఫ్లాట్ ఫామ్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు కునూరు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు సబ్ స్టేషన్ నుండి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. నెల రోజులలోపు ముదిరాజ్ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కునూరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. గ్రామ దేవతల దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు రోజా ఆశోక్, దేవేంద్ర మల్లారెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.