• 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదు

• మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

• ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం

• తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత

న్యూస్ డెస్క్: నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటే ఫీజుల నియంత్రణ అత్యవసరమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను నిర్వహిస్తున్నా… రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం దౌర్భాగ్యమని కవిత విమర్శించారు. స్కూల్ ఫీజులు 50% నుంచి 120% వరకు పెంచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం 1200 మంది అమరుల త్యాగాలతో ఏర్పడినా, ఆ భావజాలంతో పాలన సాగడం లేదని ఆమె పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం తమ పార్టీ ముఖ్య విధానమని తెలిపారు.
ప్రస్తుతం ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యాపార ధోరణితో నడుస్తున్నాయని, రాజకీయ నాయకుల ఆధీనంలో ఉన్న సంస్థలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. తల్లిదండ్రుల బలహీనతను అవకాశంగా తీసుకుని ఫీజులు పెంచుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది విద్యార్థుల్లో 65-75 శాతం మంది ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతున్నారని పేర్కొంటూ, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 120 శాతం ఫీజు పెంపును ఉదాహరణగా చూపుతూ, ప్రభుత్వ భూమిపై నడిచే స్కూల్లోనే ఇలాంటి పెంపు దారుణమని విమర్శించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి తక్షణమే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు ₹11,000 కోట్లు ఉన్నాయని, దీని వల్ల కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఎంఎస్-7 జీవో ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లకు నేరుగా డబ్బులు వేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, గత ఏడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా తక్షణమే జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల మాదిరిగా ఫీజుల నియంత్రణకు శాశ్వత అథారిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు కలిసి జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. “ఉచిత విద్య, వైద్యం ఇవ్వకపోతే అమరుల స్థూపం దగ్గర నన్ను నిలబెట్టి ప్రశ్నించండి” అంటూ కవిత తన నిబద్ధతను వ్యక్తం చేశారు.