• చేనేత కార్మికులకు సబ్సిడీలు, రాయితీలు అందించాలి
• దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ చేనేత రంగం ఎంతో కీలకం
• మహబూబ్‌నగర్‌లో చేనేత రంగానికి ప్రాధాన్యత – ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సాధ్యం
న్యూస్ డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన చేనేత హక్కుల సాధన సభలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్‌లో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార ఫోరం వ్యవస్థాపకులు టి. చిరంజీవులు మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు, గ్రామీణ ఉపాధికి చేనేత రంగం ఎంతో కీలకమైనదైనా రాష్ట్ర మరియు కేంద్ర బడ్జెట్‌లో చేనేత కార్మికుల సంక్షేమానికి సరిపడ నిధులు కేటాయించడం లేదన్నారు. చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పెద్ద పరిశ్రమలకే ఇచ్చే ప్రాధాన్యతను చేనేత రంగానికి ఇవ్వడం లేదని విమర్శించారు.
చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలకు సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడం, ముడి సరుకుల ధరలు పెరగడం, విద్యుత్ ఛార్జీలు అధికమవడం, మధ్యవర్తుల దోపిడీ పెరగడం వల్ల చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. అయినప్పటికీ బడ్జెట్‌లో చేనేతకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించకపోవడం బాధాకరమని తెలిపారు.
చేనేత దినోత్సవం వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జిల్లా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్, మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యలు ఏ ప్రభుత్వానికీ కనిపించడం లేదన్నారు. చేనేత రంగం కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా భారతీయ సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు పెన్షన్, ఆరోగ్య బీమా, విద్యా సహాయం, మగ్గాల ఆధునీకరణకు సబ్సిడీలు, నూలు ధరలపై రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసి, ప్రభుత్వ స్థాయిలో చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని సూచించారు. యువత చేనేత వృత్తివైపు రావాలంటే ఉపాధి హామీతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అన్నారు.
అదేవిధంగా మహిళా చేనేత కార్మికుల పాత్రను ప్రశంసిస్తూ, స్వయం ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలంటే సమిష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, చేనేత కార్మికులకు సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహక పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ చేనేత రంగం ఎంతో కీలకమని, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, 36వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, 9వ వార్డు కౌన్సిలర్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు రామలింగేశ్వర కాంక్షే, చేనేత రాష్ట్ర ఐక్యవేదిక కార్యదర్శి మేడం రామకృష్ణ, గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కల రమాదేవి, పద్మశాలి పట్టణ సేవా సంఘం కార్యదర్శి సాయిబాబా, కే వీరస్వామి వరంగల్, శ్రీకాంత్, పాశం యాదగిరి జర్నలిస్ట్, జె. నరేందర్ టీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి, గద్వాల పట్టణ పద్మశాలీలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు
