- నర్సంపేటలో భారీ ర్యాలీ.. అంబేద్కర్ సెంటర్ వద్ద సభ నిర్వహణ
న్యూస్ డెస్క్ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు సభ నిర్వహించారు. వరంగల్ రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కార్మికులు ఎర్రజెండాలతో భారీగా ర్యాలీ చేపట్టి కార్మిక హక్కుల కోసం నినాదాలు చేశారు.
అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగిన సభకు 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ మేడే ప్రాముఖ్యతను వివరించారు.

చికాగోలో కార్మికులు పని గంటల తగ్గింపు కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఎనిమిది గంటల పని దినం సాధ్యమైందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణకు మేడే ఒక చిహ్నమని, ఈ స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకమని, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచడం కార్మికులపై భారమని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, ఉపాధి హామీ పథకంలో నిధుల కోతలు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది వంటి అనేక వర్గాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, కూలీలు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, డ్రైవర్లు, వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
