• నర్సంపేటలో సీపీఎం ధర్నా

• మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్

న్యూస్ డెస్క్ : నర్సంపేటలో రైతుల సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ, గత నెల రోజులుగా మండలానికి ఒకటి లేదా రెండు మాత్రమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.

ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగడంతో అధిక దిగుబడులు వచ్చాయని, అయితే ప్రభుత్వం ముందస్తు అంచనాలు లేకుండా తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతాంగం నష్టపోతుందని విమర్శించారు. రైతులు పండించిన మొత్తం మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆర్డివో కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

అలాగే రబీ వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రకటించినప్పటికీ, గన్నీ సంచుల కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. అకాల వర్షాల కారణంగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తరుగు పేరుతో బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి తరుగు లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు, కోరబోయిన కుమారస్వామి, అనుమకొండ శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీద బాలకృష్ణ, ఉదయగిరి నాగమణి, బిట్ర స్వప్న, జినుకల చంద్రమౌళి, బెంబేలి మల్లారావు, రుద్రారపు లక్ష్మి, జగన్నాథం కార్తీక్, ఉదయగిరి సరిత, యాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.