• కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరితో మర్యాదపూర్వక భేటీ.. పద్మశాలి వర్గాల్లో హర్షం
న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజంలో నూతన ఉత్తేజం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ప్రముఖ సామాజిక నాయకుడు గూడూరు శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో పద్మశాలి వర్గాలు, చేనేత కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
చేనేత కార్మికుల సంక్షేమం, పద్మశాలి వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా గూడూరి శ్రీనివాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులతోనే ఈ కీలక బాధ్యతలు దక్కాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

నియామకం అనంతరం గూడూరి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పద్మశాలి వర్గాల సమస్యలు, చేనేత రంగ అభివృద్ధి, కార్పొరేషన్ ద్వారా చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో గూడూరి శ్రీనివాస్ సాంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ శాలువాతో పరికిపండ్ల నరహరిని శాలువాతో సత్కరించారు.

ఈ భేటీకి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గూడూరి శ్రీనివాస్‌కు రాష్ట్ర నాయకత్వం నుంచి లభిస్తున్న ప్రాధాన్యతపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నూతన బాధ్యతలు చేపట్టిన అనంతరం గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, “నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు. పద్మశాలి సోదర సోదరీమణుల అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తాను. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేస్తాను,” అని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మీడియా కార్యదర్శి రాంపెల్లి లింగమూర్తి, మంత్రి కమలాకర్ నేత, పద్మశాలి సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు గూడూరి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కార్పొరేషన్ మరింత చురుకుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

