
న్యూస్ డెస్క్: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ సమేత జమాదగ్ని స్వామి వారి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గ్రామమంతా పండుగ వాతావరణంలో నెలకొన్నది.ఈ మహోత్సవానికి సూరంపల్లి గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కిలకిలారావాలతో, దైవ నామస్మరణతో గ్రామం అంతా మార్మోగిపోయింది. కార్యక్రమంలో భాగంగా భక్తులకు విస్తృతంగా అన్నదానం నిర్వహించబడింది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కూడా సౌకర్యాలు కల్పించడంతో పండుగ నిర్వహణపై గ్రామస్థులు మరియు గౌడ సంఘం సభ్యులు ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈ వేడుకల్లో సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గు కథల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోగా, పోతురాజుల వేషధారణలు ఉత్సాహాన్ని నింపాయి. ఈ కళారూపాలు గ్రామీణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ పండుగకు మరింత ప్రత్యేకతను తెచ్చాయి.
