12 మందికి రూ. 35 లక్షల రాయితీ మంజూరు
పారిశ్రామిక రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి
అదనపు కలెక్టర్ భాస్కరరావు
న్యూస్ డెస్క్ : యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, తామే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్ అడిషనల్ కలెక్టర్ చాంబర్ లో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్ తో కలిసి జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ), టీఎస్ ఐపాస్ (టీఎస్-ఐపాస్) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, టీఎస్ ఐపాస్ విధానం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత కలిగిన పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీ-ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన 12 మంది నిరుద్యోగ యువతకు చేయూతనిస్తూ రూ. 35 లక్షల ప్రోత్సాహక రాయితీ మంజూరు జరిగాయని తెలిపారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
