హన్మకొండ, జూన్ 15: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హన్మకొండ జెడ్పీ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ హాల్‌లో సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ హన్మకొండ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, చంద్రమౌళి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007, రూల్స్-2011 గురించి వివరించారు. వయోవృద్ధులకు ట్రిబ్యునల్ బెంచ్ ఒక వరమని, ఎలాంటి సమస్యలు లేదా వేధింపులకు గురైనా వెంటనే ట్రిబ్యునల్‌ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

గ్రామ స్థాయి వరకు వయోవృద్ధుల చట్టాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రతి వయోవృద్ధుడు తనకు ఉన్న చట్టపరమైన హక్కులను తెలుసుకుని వినియోగించుకోవాలని సూచించారు. జీవించి ఉన్నప్పుడే తమ ఆస్తులను పూర్తిగా పిల్లలకు పంచివేయకుండా, తమ అవసరాలకు తగినంత ఉంచుకుని అనంతరం వారసత్వం కోసం వీలునామా (విల్) రాయడం మంచిదని సూచించారు.

వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం భారతీయ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ప్రేమించని వారు, వారిని ఇబ్బందులకు గురిచేసే వారు ఎంతటి కోటీశ్వరులైనా దరిద్రులతో సమానమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత పిల్లలదేననే విషయాన్ని ఎవరూ మరువకూడదన్నారు.

కార్యక్రమంలో చంద్రమౌళి, దేవాచారి, రామమూర్తి, పి.వి. శ్రీనివాస్, చంద్రజిత్ రెడ్డి, యుగేందర్, దామోదర్, సరళ, పొన్నాల రాంమోహన్, సంయుక్త, డాక్టర్ ఉష తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వయోవృద్ధులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.