న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మండల అధికారి (AO) శ్రీమతి కవిత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.
రైతు సంక్షేమ పథకాలపై అవగాహన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందజేస్తున్నామని, సాగుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేటాయిస్తోందని తెలిపారు.
అధికారుల సూచనలు పాటించాలి
రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ మెళకువలను అందిపుచ్చుకోవాలని సర్పంచ్ సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలను పాటిస్తూ పంట మార్పిడి పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించి, ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వేడుకలో సర్పంచులు అశోక్, రాజు తమ సందేశాలను వినిపించారు. వీరితో పాటు ఏఈఓ (AEO) రాజశేఖర్, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు సాగుపై పలు సూచనలు చేశారు.
