తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : డివిజన్ పరిధిలో జీన్ మాత 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిశాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘జీన్ మై కే లాడ్లే, హైదరాబాద్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా నగర్‌లోని కిషోర్ సింగర్ నివాసం నుంచి ప్రారంభమైన దీపం, గుర్రపు బగ్గీతో కూడిన శోభాయాత్ర భక్తుల నామస్మరణలు, భజనల నడుమ చంద్రాయణగుట్టలోని జీన్ మాత మందిరం వరకు కొనసాగింది. ప్రసిద్ధ భజన్ గాయకులు కిషోర్ తోష్నివాల్, అంశుల్ కొఠారి ఆలపించిన భక్తిగీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో యాత్ర సాగిన మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమానికి కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు భక్తిభావాన్ని, సత్సంప్రదాయాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. జీన్ మాత దివ్య ఆశీస్సులతో డివిజన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి జగదీష్, రాము యాదవ్, నరేష్ అగర్వాల్, చికెన్ రాజు, రామస్వామి, జగదీష్ అగర్వాల్, మల్లేష్ నేత, శ్యామ్ సుందర్‌తో పాటు స్థానిక భక్తులు, యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
