తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాజేంద్రనగర్ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి మండల ప్రజలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగ కేవలం సంప్రదాయాలకు పరిమితమైనది కాదని, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిషాసురుడి దురాగతాలను అంతం చేస్తూ దుర్గామాత విజయం సాధించిన రోజు విజయదశమి అని, సీతాదేవిని రక్షించి రావణాసురుడి పాలనకు ముగింపు పలికి శ్రీరాముడు విజయాన్ని సాధించిన పవిత్ర దినం కూడా ఇదేనని గుర్తుచేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ధైర్యాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు.ఎంతటి శక్తిమంతులైనా అధర్మం, అన్యాయం వైపు నిలిస్తే చివరికి ఓటమి తప్పదని, సత్యం, ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతంగా విజయం సాధిస్తాయని విజయదశమి మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుందని వివరించారు. ఈ పండుగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజంలో మంచిని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
