తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మొయినాబాద్ హిమాయత్‌నగర్‌లో 290 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి 19 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు పట్టాలు, హక్కు పత్రాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.

సుమారు 5 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 19 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

పేదలకు కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించే ప్రయత్నాలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్‌లో ఉన్న కూరగాయలు, పండ్ల మార్కెట్‌ను ఈ ప్రాంతానికి తరలించే ప్రయత్నాల్లో భాగంగా సర్వే నంబర్ 151లోని భూమిని కూడా కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారని, పేదలకు కేటాయించిన భూములపై రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిళ్లు తగవని హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.

సర్వే నంబర్ 151పై సమగ్ర విచారణ జరిపించాలని, 19 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 290 మంది లబ్ధిదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేశారు.

42 రోజులుగా నిరాహార దీక్ష :  పేదల భూములను కాపాడేందుకు అవసరమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హేమా సుదర్శన్ జిల్లోజు తెలిపారు. 290 మంది లబ్ధిదారులకు వారి భూములపై పూర్తి హక్కులు, పట్టాలు లభించే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి, స్టేట్ కిసాన్ వింగ్ నాయకుడు నీరెడ్డి ఆంజనేయులు, రాష్ట్ర నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.