తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం ఉద్యమబాటలో ముందుకు సాగుతున్న తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్)లో వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయ నాయకుడు కె. నాగరాజు ఆధ్వర్యంలో డీటీఎఫ్ జిల్లా నాయకుడు జె. శ్రీనివాస్ రావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజేంద్రనగర్‌కు చెందిన ఉపాధ్యాయులు, టీపీఆర్‌టీయూ జిల్లా నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన పలువురు నాయకులు టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యా రంగ అభివృద్ధికి కృషి చేయడం సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా డీఏ బకాయిలు విడుదల, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడం, హెల్త్ కార్డుల సమర్థ అమలు, వైద్య సేవల మెరుగుదల, ఉపాధ్యాయుల సర్వీస్ సమస్యల పరిష్కారం, టెట్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడు టీఎస్‌యూటీఎఫ్‌తో కలిసి ఉద్యమాల్లో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ఐక్యత ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని, రాజేంద్రనగర్ మండలంలో కూడా అనేక మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యలపై మరింత బలమైన ఉద్యమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సీతయ్య,శ్రీనివాస్ రెడ్డి,ఎండీ సదత్ అలీ, మహేశ్వర్ ప్రభాకర్,ఖలేద్,నాగమణి,బాలకృష్ణ,నందన,పరమేష్,గోపాల కృష్ణ, ఆంజనేయులు,మధర్,సి హెచ్. ఉమలత తదితరులు పాల్గొన్నారు.