తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్‌లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు 25వ తేదీ మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ బండి రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం, ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమంలో బండి రమేష్ దంపతులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అమ్మవారి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.