తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు గురువారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదా దేవి, దేవాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు ఆలయ గోశాలలో గోవులకు గోగ్రాసం అందించి, శంకరాచార్యులు మరియు వల్లభ గణపతులను దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. తదుపరి శివాలయంలో భద్రేశ్వర స్వామికి అభిషేకం చేసిన గవర్నర్ దంపతులకు ఆలయ మహామండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను సమర్పించారు. అలాగే అమ్మవారి తైలవర్ణ చిత్రపటాన్ని బహూకరించగా, గవర్నర్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రధాన కార్యదర్శి దానకిషోర్, జిల్లా పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
