తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు:మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుకు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన అవినీతి సరిపోవడం లేదని వర్కర్స్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర యూత్ ఇంచార్జ్ ఆంకర్ మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు.
పదవి పోయాకే రైతులు గుర్తొచ్చారా? “హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు పదవి లేకపోయేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇవ్వడం లేదంటూ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. హరీష్ రావులాగా ఇరిగేషన్ ల్యాండ్లలో ఫామ్ హౌస్‌లు కట్టుకోవడం మాకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసిందల్లా రైతులకు సరైన సమయానికి సాగునీరు అందించడమే” అని మధు స్పష్టం చేశారు. కమిషన్లకు ఆశపడి, కృంగిపోయి కూలిపోయే ప్రాజెక్టులను తాము కట్టబోమని ఆయన గుర్తు చేశారు.అవినీతి వల్లే కేసీఆర్ శాఖను మార్చారు!
ఇరిగేషన్ శాఖలో అత్యంత అవినీతికి పాల్పడుతున్నారనే ఉద్దేశంతోనే, అప్పటి సీఎం కేసీఆర్ హరీష్ రావును ఆ శాఖ నుండి తొలగించారని మధు ఆరోపించారు. సొంత అల్లుడు కావడంతోనే కేసీఆర్ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదన్నారు. సొంత నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మిస్తే.. అందులో ముంపునకు గురైన అల్లిపూర్ గ్రామానికి ఎకరం పంటకు కూడా నీరందని పరిస్థితి ఉందంటేనే హరీష్ రావు ‘పనితనం’ ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.హరీష్ రావు మాయ మాటలను సిద్దిపేట ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆంకర్ మధు అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 50 వేల దొంగ ఓట్లతోనే హరీష్ రావు గెలుస్తున్నారని, ఎస్ఐఆర్ (SIR) ప్రోగ్రాం ద్వారా హరీష్‌కు గట్టి దెబ్బ పడడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట జనాలు హరీష్ రావును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
