హనుమకొండ, జూలై 14 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు అందిస్తున్న ఓనర్-కమ్-డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న నెలవారీ అద్దె రూ.33 వేల నుంచి కనీసం రూ.55 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, 2017లో అమలులోకి వచ్చిన జీవో ప్రకారమే ఇప్పటికీ అద్దె చెల్లింపులు కొనసాగుతున్నాయని, అయితే పెట్రోల్, డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా, ఫిట్‌నెస్ ఫీజులు, విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుతం ఇస్తున్న అద్దె సరిపోవడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల హెచ్‌వోడీలకు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దె వాహనాల బిల్లులు సుమారు రూ.170 కోట్ల మేర బకాయిలుగా ఉన్నాయని, వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో వాహనాల ఈఎంఐలు, పిల్లల విద్యా ఫీజులు, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.
ప్రతి నెల ఐదో తేదీలోపు వాహనాల బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బిల్లుల చెల్లింపుల్లో మూడు నుంచి ఆరు నెలల వరకు జాప్యం జరుగుతుండటంతో ఫైనాన్స్ కంపెనీల ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులను తట్టుకోలేక కొంతమంది డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు.
అద్దె చార్జీల పెంపుతో పాటు బకాయి బిల్లులను వెంటనే విడుదల చేసి, భవిష్యత్తులో ప్రతి నెల సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అద్దె వాహనాల ఓనర్-కమ్-డ్రైవర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
