తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా గోపాలస్వామి జంక్షన్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, నేతన్న విగ్రహానికి చేనేత ఐక్య వేదిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర విభాగం, వరంగల్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో 23వ డివిజన్ కొత్తవాడలో అంతర్జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు అంతర్జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
చేనేత కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం చేనేత ఐక్య వేదిక నిరంతరం అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. నేతన్నలకు ఎలాంటి కష్టం వచ్చినా వారి సమస్యల పరిష్కారం కోసం చేనేత ఐక్య వేదిక ముందుండి పోరాడుతుందని భరోసా కల్పించారు.
చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నేతన్నలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు మంత్రి కమలాకర్ నేత, దాసరి సుధాకర్ నేత, ఆర్గనైజింగ్ సెక్రటరీ తురాయి రజిని, సహాయ కార్యదర్శి వంగరి వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్ నేత, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొంతుల రాజేష్ నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యేలుగం శివకుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధిక సంఖ్యలో చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. చేనేత రంగ పరిరక్షణకు, నేతన్నల హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
– రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర విభాగం, వరంగల్ జిల్లా విభాగం
