* ప్రశ్న నెం.10ను సవరించకపోతే వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా బీసీలకు ప్రయోజనం శూన్యం
* ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాసినా స్పందన లేదు.. కేంద్రం ఇప్పటికైనా బీసీ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి!

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్లను, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోకుండా 2027 జనగణనలో కులగణన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సరైన విధానం కాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. కులగణనలో బీసీల జనాభాను కచ్చితంగా గుర్తించేందుకు ప్రశ్న నెం.10లో ప్రత్యేక OBC/BC కేటగిరీని చేర్చడంతో పాటు శాస్త్రీయ కుల కోడింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ.. “బీసీలకు సంబంధించిన కచ్చితమైన లెక్కలు కావాలని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి లేఖల ద్వారా స్పష్టంగా విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటివరకు సమస్యకు పరిష్కారం చూపే స్థాయిలో స్పందన కనిపించలేదు. దేశంలో కోట్లాది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన అంశాన్ని కేంద్రం ఇంత తేలికగా తీసుకోవడం ఆందోళనకరం” అని అన్నారు.

కులం పేరు రాస్తే సరిపోతుందా?

2026 ఆగస్టు 14న కేంద్రం అధికారికంగా ప్రకటించిన జనగణన ప్రశ్నావళిలో మొత్తం 40 ప్రశ్నలు ఉండగా, 10వ ప్రశ్న “Scheduled Caste (SC)/Scheduled Tribe (ST)/Caste”గా ఉంది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్పష్టమైన గుర్తింపు ఉన్నప్పటికీ, ఇతరుల కుల వివరాల కోసం ఓపెన్‌ ఎండెడ్‌ ఫీల్డ్‌ను ఉపయోగించే విధానం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రశ్నావళిలో “OBC” లేదా “Backward Class” అనే పదం ప్రత్యేక కేటగిరీగా లేదు.

“ఒక వ్యక్తి చెప్పిన కులం పేరును అలాగే నమోదు చేస్తే అది కులగణనకు సరిపోదు. ఒకే కులానికి ప్రాంతానికో పేరు, భాషకో పేరు, ఉపకులానికో పేరు, స్థానికంగా మరో పేరు ఉండవచ్చు. వాటిని ఒకే ప్రామాణిక కులంతో అనుసంధానం చేయకపోతే చివరికి లెక్కల్లో ఒకే కులం అనేక పేర్లుగా విడిపోయే ప్రమాదం ఉంది” అని గుజ్జ సత్యం వివరించారు.

ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతలు కూడా ఓపెన్‌ ఎండెడ్‌ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ముందుగా ప్రామాణిక కులాల జాబితాను రూపొందించి డిజిటల్‌ డ్రాప్‌డౌన్‌ విధానంలో నమోదు చేయాలని ప్రధానమంత్రిని కోరారు.

“బీసీల జనాభా ఎంత అనేదే తేలకపోతే.. బీసీల హక్కులు ఎలా తేలుస్తారు?”

బీసీల జనాభా కచ్చితంగా ఎంత ఉందో తెలియకుండా వారి సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యంపై సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యమని గుజ్జ సత్యం ప్రశ్నించారు.

“బీసీలకు ఎంత రిజర్వేషన్‌ అవసరం? ఏ కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి? ఏ ప్రాంతాల్లో బీసీల సామాజిక, విద్యా వెనుకబాటుతనం ఎక్కువగా ఉంది? ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, రాజకీయ వ్యవస్థలో వారి వాస్తవ ప్రాతినిధ్యం ఎంత? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా బీసీల జనాభా కులాల వారీగా కచ్చితంగా తెలియాలి” అని అన్నారు.

కేవలం వ్యక్తి చెప్పిన కులం పేరును నమోదు చేసి, తరువాత దాన్ని ఎలా వర్గీకరిస్తారనే స్పష్టత లేకపోతే కులగణన ద్వారా సేకరించే డేటా భవిష్యత్‌ విధానాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే ప్రశ్న తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు.

2011 అనుభవం నుంచి పాఠం నేర్చుకోలేదా?

గత సామాజిక-ఆర్థిక కులగణన అనుభవాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని గుజ్జ సత్యం అన్నారు. 2011లో సేకరించిన కుల వివరాల్లో భారీ సంఖ్యలో కుల, ఉపకుల, స్థానిక పేర్లు నమోదైన అంశం అప్పటినుంచి డేటా ప్రామాణీకరణపై చర్చకు కారణమైందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత కులగణనలో అదే సమస్య పునరావృతం కాకుండా ముందుగానే సాంకేతిక పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.

“గతంలో ఎదురైన సమస్యలను మళ్లీ పునరావృతం చేయడానికి జనగణన కాదు. గత అనుభవాల నుంచి నేర్చుకుని మరింత శాస్త్రీయమైన, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలి” అని ఆయన సూచించారు.

తెలంగాణ చూపిన మార్గాన్ని కేంద్రం పరిశీలించాలి

తెలంగాణలో నిర్వహించిన కుల సర్వేను కూడా కేంద్రం ఒక ముఖ్యమైన అనుభవంగా పరిశీలించాలని గుజ్జ సత్యం అన్నారు. తెలంగాణ సర్వేలో ముందుగా సామాజిక వర్గాన్ని గుర్తించి, అనంతరం సంబంధిత కులాన్ని ప్రామాణిక జాబితాతో అనుసంధానించే విధానాన్ని ఉపయోగించారని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. తెలంగాణ సర్వేలో మొత్తం 242 కులాలను గుర్తించి, వాటిని BC/OBC, SC, ST, ఇతర వర్గాలుగా వర్గీకరించినట్లు నివేదికలు వెల్లడించాయి. అలాగే తెలంగాణలో 2027 జనగణనకు సంబంధించి ఓబీసీల సమగ్ర లెక్కింపు చేపట్టాలని తెలంగాణ బీసీ కమిషన్‌ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేయడం ఈ అంశం ఎంత కీలకమో స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.

₹11,718 కోట్ల ఖర్చు.. డేటా ఉపయోగపడకపోతే బాధ్యత ఎవరిది?

జనగణన కోసం కేంద్రం సుమారు ₹11,718 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. ఈ భారీ ప్రజాధనంతో నిర్వహించే దేశవ్యాప్త ప్రక్రియ ద్వారా భవిష్యత్‌ విధానాలకు ఉపయోగపడే నాణ్యమైన డేటా రావాల్సిన అవసరం ఉందని గుజ్జ సత్యం అన్నారు.

“ప్రజల పన్నుల నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు.. చివరికి బీసీల కచ్చితమైన జనాభా ఎంత అనేది కూడా చెప్పలేని పరిస్థితి వస్తే ఆ డేటా వల్ల ప్రయోజనం ఏమిటి? కులగణన పేరుతో డబ్బు ఖర్చు చేయడం కాదు.. దేశానికి ఉపయోగపడే కుల డేటాను సృష్టించడం ప్రభుత్వ బాధ్యత” అని ఆయన అన్నారు.

జనగణన అనేది కేవలం సంఖ్యల సేకరణ కాదని, రాబోయే దశాబ్దాల్లో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, వనరుల కేటాయింపు, సామాజిక న్యాయ విధానాలకు పునాది వేయాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు.

కేంద్రం వెంటనే తీసుకోవాల్సిన చర్యలివే

2027 కులగణనను బీసీలకు ప్రయోజనకరంగా మార్చేందుకు కేంద్రం తక్షణమే కింది చర్యలు తీసుకోవాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు:

1. ప్రశ్న నెం.10లో ప్రత్యేక OBC/BC కేటగిరీని స్పష్టంగా చేర్చాలి.
2. రాష్ట్రాల వారీగా అధికారిక BC/OBC కులాల ప్రామాణిక జాబితాలను రూపొందించాలి.
3. ప్రతి కులానికి యూనిక్ కాస్ట్ కోడ్ కేటాయించాలి.
4. డిజిటల్‌ జనగణన యాప్‌లో డ్రాప్‌డౌన్‌ ఆధారిత కుల ఎంపిక విధానం ప్రవేశపెట్టాలి.
5. కులాల పర్యాయపదాలు, ప్రాంతీయ పేర్లు, ఉపకులాలను ఒకే ప్రామాణిక కోడ్‌కు అనుసంధానం చేయాలి.
6. ఎన్యూమరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
7. కుల డేటా ప్రామాణీకరణకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.
8. బీసీ సంఘాలు, రాష్ట్ర బీసీ కమిషన్లు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలి.

“బీసీల ఉద్యమాన్ని విస్మరిస్తే.. చరిత్ర క్షమించదు”

బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని కేవలం రాజకీయ డిమాండ్‌గా చూడటం సరికాదని గుజ్జ సత్యం అన్నారు. “ఇది బీసీల రాజకీయ డిమాండ్ మాత్రమే కాదు. ఇది భవిష్యత్‌ తరాల సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం. బీసీల సంఖ్యే కచ్చితంగా తెలియని పరిస్థితిలో వారి హక్కులు, వాటా, ప్రాతినిధ్యం గురించి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని బీసీ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

“కులగణన చేయడం మాత్రమే విజయం కాదు. కులగణనలో బీసీలను కచ్చితంగా లెక్కించడం అసలు విజయం. లెక్కల్లో బీసీలు కనిపించాలి.. ఆ లెక్కలు ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబించాలి.. అప్పుడే కులగణనకు అర్థం ఉంటుంది. లేకపోతే వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, చివరికి బీసీలకు ‘మీ జనాభా ఎంత?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి రావచ్చు” అని గుజ్జ సత్యం హెచ్చరించారు.

Avatar photo

By Murthy