తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మూసాపేట డివిజన్‌లోని చిత్తారమ్మ టెంపుల్ పరిసర ప్రాంతంలో రెండు రోడ్డు వైడెనింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో, అక్కడ ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా చిత్తారమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోని తోపుడు బండ్ల కార్మికులు, చిరు వ్యాపారులు టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. రోడ్డు వైడెనింగ్ కారణంగా తమ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, తమ కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి, తమ జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని బండి రమేష్ ను కోరారు. కార్మికులు, చిరు వ్యాపారుల సమస్యలను సానుకూలంగా విన్న బండి రమేష్, వారి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, సీనియర్ లీడర్ గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఏఎంసి వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, బాలరాజు చును పాషా ,గోవింద గౌడ్, రమణ , స్థానిక నాయకులు పాల్గొన్నారు

You missed